Autobiography in telugu

తెలుగులో తప్పక చదవాల్సిన టాప్ టెన్ ఆత్మకథలు

ఒక ఆత్మకథ చదివితే చాలు.. అందులో మనకు ఎన్నెన్నో అనుభవాలు, అంతరంగాలు కచ్చితంగా దర్శనమిస్తాయి. ఆటోబయోగ్రఫీలు, బయోగ్రఫీలు చదవడం వల్ల ఓ వ్యక్తి జీవితం గురించి కూలంకషంగా తెలుసుకోవచ్చు. అందులో మంచిని ప్రేరణను తీసుకుంటూ.. చెడు నుండి పాఠాలు నేర్చుకుంటూ.. మన జీవితానికీ బాటలు వేసుకోవచ్చు.

ఆత్మకథ చదవడం అనేది నిజంగానే గొప్ప అనుభవం. పఠనాభిలాష ఉన్నవారు మంచి వ్యక్తిత్వాన్ని పెంచుకోవడానికి ఆత్మకథలు కచ్చితంగా చదివి తీరాల్సిందే. ఈ క్రమంలో తెలుగులో ప్రతీ ఒక్కరూ చదవాల్సిన పలు ఆత్మకథల గురించి జీన్యూస్ పాఠకులకు ఈ వ్యాసం ప్రత్యేకం..!

సత్యశోధన - మహాత్మ గాంధీ రచించిన "మై ఎక్స్‌పరిమెంట్స్ విత్ త్రూత్" అనే ఆంగ్ల పుస్తకానికి తెలుగు అనువాదమే "సత్యశోధన".

గాంధీజీ స్వయంగా రచించిన ఈ ఆత్మకథలో ఆయన బాల్యానికి సంబంధించిన ఎన్నో విషయాలతో పాటు తన జీవితానుభవాలు... దండి యాత్ర, చంపారన్ ఉద్యమం, సహాయ నిరాకరణోద్యమం మొదలైన వాటిలో తన పాత్ర ఇత్యాది విషయాలను గురించి ఆసక్తికరంగా చర్చించారు. నిజంగానే ప్రతీ ఒక్కరూ కచ్చితంగా చదవాల్సిన పుస్తకం.

ఒక విజేత ఆత్మకథ - ప్రముఖ అణు శాస్త్రవేత్త, భారతరత్న అబ్దుల్ కలామ్ స్వయంగా రాసుకున్న ఆత్మకథ "వింగ్స్ ఆఫ్ ఫైర్".

దాని తెలుగు అనువాదమే "ఓ విజేత ఆత్మకథ". ఈ పుస్తకంలో ఆయన ఎంత కష్టపడి ఇంజనీరింగ్ పూర్తి చేసి మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకున్నారో తెలియజేశారు. తన కెరీర్ విషయాలతో పాటు తన ఉద్యోగానుభవాలు, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఆయన ఎదుర్కొన్న సవాళ్లు.. ఇస్రోతో ఉన్న అనుబంధం... పోఖ్రాన్ అణు పరీక్షలో తన పాత్ర.. ఇలా అన్ని విషయాలను కూడా చాలా లోతుగా చర్చించిన పుస్తకం ఇది.

తప్పకుండా ప్రతీ యువకుడు చదవాల్సిన పుస్తకం.

నాకూ ఉంది ఒక కల - భారతదేశంలో శ్వేత విప్లవానికి నాంది పలికిన వ్యక్తి వర్గీస్ కురియన్. ఆయన ఆంగ్లంలో రచించిన “ఐ టూ హాడ్ ఏ డ్రీమ్” పుస్తకానికి తెలుగు అనువాదమే "నాకూ ఉంది ఒక కల". ఒక కాలేజీ టాపర్‌గా తనకు ఎన్నో విదేశీ సంస్థలతో పాటు కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు వచ్చినా కూడా..

వాటిని అన్నింటినీ కూడా వదులుకొని.. భారతదేశంలో పాల ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభించడానికి శ్రీకారం చుట్టి విజేతగా నిలిచిన వ్యక్తి వర్గీస్ కురియన్. ఆయన ఆత్మకథ ఎందరో యువ వ్యాపారవేత్తలకు ఆదర్శం అనడంలో అతిశయోక్తి లేదు.

అనంతం - మహాకవి శ్రీశ్రీ కలం నుండి జాలువారిన ఆత్మకథ "అనంతం". శ్రీశ్రీ తన ఆత్మకథలో తన బాల్యానికి సంబంధించిన విషయాలతో పాటు, కవిత్వంలో తాను చేసిన ప్రయోగాలను గురించి ,సర్రియలిజం గురించి,తన నాస్తిక వాదం గురించి, విదేశీ ప్రయాణాల గురించి రాసాడు.

చాలా ఆసక్తికరమైన ఆత్మకథ ఇది.

ఓ హిజ్రా ఆత్మకథ - "ఐ వాజ్ బార్న్ టు సర్వైవ్" అంటూ హిజ్రాల హక్కుల కోసం గళం విప్పిన ధీరవనిత రేవతి. హిజ్రాలకు కూడా సామాన్య మనుషుల్లా బ్రతకాలని ఉంటుందని.. మగ శరీరంలో స్త్రీ మెదడుతో పుట్టడం తమ తప్పు కాదని చెబుతూ.. తాను తమ హక్కుల పోరాటం కోసం ఎన్ని అగచాట్లు పడిందో హృద్యంగా తెలిపిన ఆమె ఆత్మకథ "ది ట్రూత్ ఎబౌట్ మి".

ఆ పుస్తకానికి తెలుగు అనువాదమే "ఓ హిజ్రా ఆత్మకథ".

నా యెఱుక - తెలుగు నాట హరికథలకు ఆద్యుడు శ్రీ ఆదిభట్ల నారాయణదాసు, "హరికథ పితామహుడిగా" పేరొందిన ఆయన రాసుకున్న స్వీయ చరిత్రే "నా యెఱుక". గుంటూరు మిత్రమండలి ప్రచురణల వారు ఈ పుస్తకాన్ని ప్రచురించారు.

చేగువేరా మోటార్ సైకిల్ డైరీస్ - క్యూబా విప్లవ యోధుడు "చేగువేరా" కలం నుండి జాలువారిన ఆత్మకథే "మోటార్ సైకిల్ డైరీస్".

డాక్టరుగా కెరీర్ ప్రారంభించిన తర్వాత దేశమంతా తన స్నేహితుడితో కలిసి తిరిగి ప్రజల జీవితాలను దగ్గరుండి చూసిన చేగువేరా ఆ అనుభవాలను అక్షరీకరించారు. ఆ పుస్తకాన్ని ప్రజాశక్తి బుక్ హౌస్ తెలుగులో అనువదించడం జరిగింది.

నా ఆత్మకథ - సాక్షాత్తు స్వామి వివేకానంద తాను రాసుకున్న స్వీయ అనుభవాల గాథే "నా ఆత్మకథ". ఈ పుస్తకాన్ని రామక్రిష్ణ మఠం వారి ప్రచురణ శాఖ తెలుగులో అనువదించింది.

"దుష్టవిధి కల్పించే ఆవరణ అంధకార బంధురం. కానీ నేను యజమానిని. చూడు, నేను చెయ్యి ఎత్తగానే అది పటాపంచలవుతుంది! ఇదంతా అర్థరహితం. మరి భయమా? నేను భయానికి భయాన్ని, భీతికి భీతిని. నేను నిర్భయ అద్వితీయ ఏకాన్ని. నేను విధి నియామకుణ్ని, సర్వం తుడిచేవేసేవాడిని" లాంటి ఎన్నో ఆదర్శప్రాయమైన సూక్తులు ఈ ఆత్మకథలో మనకు దర్శనమిస్తాయి.

లోపలి మనిషి- మాజీ ప్రధాని పివి నరసింహారావు కలం నుండి జాలువారిన "ది ఇన్ సైడర్" అనే ఆటోబయోగ్రఫీకి తెలుగు అనువాదమే "లోపలి మనిషి".

ఇందులో పీవీ రాజకీయ అనుభవాలతో పాటు ఆయన కాంగ్రెస్ పార్టీలో వ్యవహారదక్షుడిగా పోషించిన ప్రధానమైన పాత్ర.. ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుండి ప్రధానిగా ఎదిగిన క్రమం.. ఇత్యాదివన్నీ పొందుపరచబడ్డాయి.

అంబేద్కర్ ఆత్మకథ - అంబేద్కర్‌ స్వదస్తూరీతో ఇంగ్లీష్‌లో రాసిన 'వెయింటింగ్‌ ఫర్‌ ఎ వీసా'కు తెలుగు అనువాదమే "అంబేద్కర్ ఆత్మకథ".

మాదిగ గూడెం నుంచీ మాలపల్లి నుంచీ విముక్తి చెంది ఊళ్ళోకి వెళ్ళడానికి ప్రవేశ అర్హత లేని స్థితిలో అంటరాని జాతి ప్రజలు పొలిమేరలో పడిగాపులు పడే అవస్థనే 'వెయింటింగ్‌ ఫర్‌ ఎ వీసా' అని అంబేద్కర్‌ విశేషార్థంలో ప్రయోగించారు.ఈ రచనను సౌదా అరుణ తెలుగులోకి అనువదించారు.